పుత్తడి బొమ్మలకు పుస్తెలు కాదు.. పుస్తకాలే కావాలి!
ఏజెన్సీలో వంద శాతం బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
పెళ్లిళ్లు జరిపించినా.. సహకరించినా జైలు శిక్ష తప్పదు
ఐటీడీఏ అదనపు పీఓ కుమురం నాగోరావు
కాకతీయ, ఏటూరునాగారం : బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి వర్గం బాధ్యతగా భాగస్వామ్యం కావాలని, ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కుమురం నాగోరావు పిలుపునిచ్చారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయన్నారు. వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం ఉన్న పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్లు సామాజిక బాధ్యతతో స్పందించి బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. చిన్న వయస్సులో పెళ్లిళ్ల వల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, అందుకే బాలికల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
జిల్లా సంక్షేమ అధికారి ఈ.పీ. ప్రేమలత మాట్లాడుతూ.. ‘పుత్తడి బొమ్మలకు పుస్తెలు కాదు.. పుస్తకాలే కావాలి’ అని పేర్కొన్నారు. పెళ్లిళ్లకు ముందే వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) జె. ఓంకార్ మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా తప్పుదన్నారు. నేర తీవ్రతను బట్టి వరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదవుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించి, గోడపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ కె.ముత్తమ్మ, అంగన్‌వాడీ సిబ్బంది, టెంట్‌హౌస్ నిర్వాహకులు, పురోహితులు, అధికారులు పాల్గొన్నారు.

