డీసిల్టింగ్ విధానం రద్దు చేయాలి
ఏజెన్సీ వనరులను కొల్లగొడుతున్న ప్రభుత్వం
కొంతమంది బడా బాబుల లాభం చేకూర్చేందుకే ఈ కుట్ర
లాభాల్లో వాటాను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు
పేసా చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గౌరవించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ హెచ్చరిక
కాకతీయ, నూగూరు వెంకటాపురం : డీసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో తవ్వుతూ.. నదీ పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఏజెన్సీ వనరులను బడా బాబులకు దారదత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీసిల్టింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. డీసిల్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని భద్రాచలం – పేరూరు రాష్ట్రీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీతో పాటు పలు ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ ములుగు జిల్లా ఏజెన్సీలోని గోదావరి నది ఇసుకను బడా బాబులకు దోచి పెట్టేందుకు సీతారామ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పేరుతో ప్రభుత్వం డీసిల్టు విధానాన్ని ప్రవేశపెట్టి సర్వే చేపట్టిందని మండిపడ్డారు.
భారీ యంత్రాలతో ఇసుక తరలింపునకు కుట్ర
పర్యావరణ అనుమతులు లేవంటూ కోర్టు నిలుపుదల చేసిన సీతారామ ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో గోదావరి నదిలో అధికారులు సర్వే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనుమతుల ముసుగులో భారీ యంత్రాలతో గోదావరి నది నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం బ్యాక్ వాటర్ తో ఇప్పటికే ఏజెన్సీలో పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఇప్పుడు డీసిల్టేషన్ పేరుతో భారీ యంత్రాలను రంగంలోకి తీసుకువచ్చి లక్షల కోట్ల విలువైన ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విక్రయాల ద్వారా వస్తున్న లాభాల్లో వాటాను స్థానిక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎక్కడా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు.
స్థానిక గిరిజన సొసైటీలకే తవ్వకాలు ఇవ్వాలి
గోదావరిని ధ్వంసం చేయకుండా, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఇసుకను తరలించే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో రవాణా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రవికుమార్ కోరారు. ఏజెన్సీ ప్రజల ఉపాధికి నష్టం కలగకుండా స్థానికంగా రిజిస్ట్రేషన్ అయిన గిరిజన సొసైటీలకు మాత్రమే ఇసుక తవ్వకాలు, తరలింపు బాధ్యతలను కేటాయించాలన్నారు. ఏజెన్సీ గిరిజన చట్టమైన పేసా చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, స్థానిక సొసైటీలను నిర్వీర్యం చేసి బడా కాంట్రాక్టర్లను తీసుకువచ్చి భారీ విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను గౌరవించాలి
ఓ పక్క కర్రెగుట్టలను స్వాధీనం చేసుకొని అడవి మొత్తాన్ని ప్రైవేటు పరం చేశారని, మరోపక్క గోదావరి నదిని విచ్ఛిన్నం చేసి డీసిల్టేషన్ పేరుతో గిరిజన సాగుభూములను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని వెంటనే విరమించుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. విధ్వంసకర పద్ధతిలో గోదావరి నదిలో జరుగుతున్న డీసిల్టేషన్ ను నిలిపివేయాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను గౌరవించాలని స్పష్టం చేశారు. ములుగు ఏజెన్సీలో డీసిల్టేషన్ విధానాన్ని రద్దు చేయకపోతే కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బి. రెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, దావుద్, పొదిళ్ల చిట్టిబాబు, సీపీఎం మండల కార్యదర్శి గ్యానం వాసు, మండల నాయకులు చిట్టిం ఆదినారాయణ, కుమ్మరి శీను, టీడీపీ నాయకులు లక్ష్మణరావు, ఆత్మకూరు పట్టాభి, సాంబం తదితరులు పాల్గొన్నారు.

