అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కాకతీయ, గీసుగొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతన కేసులు నమోదై ఉన్నట్లు గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మే 29న మధ్యాహ్నం గీసుగొండ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి కొనాయిమాకుల ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,ఒక మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు.వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా,గీసుగొండ మండలంలోని రాంపూర్, ఎలుకుర్తి, శాయంపేట, గొర్రెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులు,ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ వద్ద ఉన్న పంపు మోటర్లు, ఇనుప సామగ్రి, ఒక మోటార్ సైకిల్‌ను గత పది రోజులుగా చోరీ చేసినట్లు అంగీకరించారు.అరెస్టు చేసిన నిందితులు కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీ వడ్డెర కాలనీకి చెందిన సూర రవి, మహబూబాబాద్ జిల్లా సుక్కమ్మ బజార్‌కు చెందిన ఎం.డి. ఇమ్రాన్ అలియాస్ ఇమామ్‌గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్, రెండు 3 హెచ్‌పీ మోటర్లు, రూ.9 వేల నగదు, ఒక మోటార్ వాల్వ్, ఎనిమిది సెంట్రింగ్ ఐరన్ పైపులు, రెండు బకెట్లు,రెండు ఐరన్ రాడ్లు,రెండు రాతెండు బిందెలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.35 వేలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.పోలీసుల విచారణలో సూర రవిపై కరీంనగర్, కేశవపట్నం, బోయినపల్లి,మానకొండూరు, మిల్స్ కాలనీ, ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 24 దొంగతన కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. అలాగే ఎం.డి.ఇమ్రాన్ అలియాస్ ఇమామ్‌పై వరంగల్ మిల్స్ కాలనీ, నర్సంపేట,ఖానాపూర్, మహబూబాబాద్,కాగజ్ నగర్,గీసుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 9 దొంగతన కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. ఇద్దరు నిందితులపై సస్పెక్ట్ షీట్లు కూడా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ జి.అనిల్ కుమార్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీఐ డి. విశ్వేశ్వర్ అభినందించారు.

