చలపర్తిలో ఉచిత మెగా వైద్య శిబిరం
400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు, మందుల పంపిణి
కాకతీయ, దుగ్గొండి: మండలంలోని చలపర్తి గ్రామంలో శనివారం కీ.శే. కోల నర్సయ్య–వీరలక్ష్మి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్లోరీ నర్సంపేట, మెడికవర్ హాస్పిటల్ హంటర్ రోడ్ వరంగల్, తెలంగాణ పాలిక్లినిక్ వరంగల్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 400 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
శిబిరంలో బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, సమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మెడికవర్ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించగా, తెలంగాణ పాలిక్లినిక్ సహకారంతో అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కోటగిరి భాస్కర్ శిబిరం విజయవంతానికి కృషి చేశారు.
కార్యక్రమంలో డా. హరి రమాదేవి, డా. పొల నటరాజ్, ఎస్‌ఐ రావుల రణధీర్, ఏఎస్‌ఐ ప్రభాకర్, గ్రామ కార్యదర్శి గోడిశాల కావ్య, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, తెలంగాణ పాలిక్లినిక్ బృందం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

