ఫ్యాషన్‌గా మొదలై వ్యసనంగా మారుతున్న పొగాకు
గుండె జబ్బులు, క్యాన్సర్‌కు పొగాకే ప్రధాన కారణం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో వైద్యుల అవగాహన
కాకతీయ, కరీంనగర్ : పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటని వైద్యులు పేర్కొన్నారు. పొగాకు అలవాటు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికీ ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ బీడీ, సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయని తెలిపారు. పొగాకు కారణంగా రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను యువతను ఆకర్షించేలా వివిధ రుచులు, ఆకర్షణీయ ప్యాకింగ్‌తో మార్కెట్లోకి తీసుకురావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారి ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు.
పొగతాగే వ్యక్తి మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్నవారు కూడా పరోక్షంగా నష్టపోతారని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు సెకండ్ హ్యాండ్ స్మోక్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, అలెర్జీలు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే అవకాశముందని వివరించారు.నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో అధిక శాతం పొగాకు వినియోగంతోనే సంబంధం ఉందని తెలిపారు. బీడీ తయారీ రంగంలో పనిచేసే కార్మికుల్లో కూడా ఆరోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు లొంగకుండా ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

