శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
ఎమ్మెల్యే కవ్వంపల్లికి రైతుల కష్టాలు కనిపించడం లేదా?
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్
కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కరువు మండలాల జాబితాలో శంకరపట్నాన్ని చేర్చకపోవడం అన్యాయమని వెంకటరెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌లో కాకతీయ కాలువ ద్వారా సాగునీరు అందలేదని, రబీలోనూ నీటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతుల కష్టాలు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ సాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అలివేలు సమ్మిరెడ్డి, దండు కొమురయ్య, దొంగల రాములు, జంగ జైపాల్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, మందాడి జగ్గారెడ్డి, చెర్ల శ్రీనివాస్, నిమ్మశెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

