చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు
బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.11.75 లక్షలు
మహిళా సంఘాలకు మరో మూడు భవనాలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, చందుర్తి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రూ.91.75 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. చందుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు భోజనశాల, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.58 లక్షలు మంజూరు చేయించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సమీప బావుల నుంచి పైప్లైన్ ద్వారా నీటిని వాటర్ ట్యాంకులకు తరలించేందుకు జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.11.75 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల భవన నిర్మాణానికి రూ.10 లక్షలతో భూమిపూజ నిర్వహించగా, సుమారు రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, చందుర్తిలో మరో మూడు మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం స్థలాలను గుర్తించి తీర్మానాలు పంపాలని అధికారులకు సూచించారు.

