మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
*మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది
*మహిళల అభివృద్ధి, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది
*కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం
*మహిళా సమైక్య భవనాల శంకుస్థాపనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ,గీసుగొండ: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలంలోని ఎలుకుర్తి హవేలీ,ఆరేపల్లి, చంద్రయ్యపల్లి, గంగాదేవిపల్లి, కొనాయిమాకులు, విశ్వనాథపురం, ఊకల్ హవేలీ,మరియాపురం, శాయంపేట హవేలీ గ్రామాల్లో మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళా సంఘాల వ్యవస్థ ప్రారంభమైందని, దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు.రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, బ్యాంకు రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,పెట్రోల్ బంకులు,సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రైస్ మిల్లులు, మహిళా శక్తి సూపర్ బజార్లు, వి-హబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అనుగుణంగా ఆధునిక వసతులతో గ్రామ మహిళా భవనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పరకాల మహిళా డెయిరీని మహిళలపై పూర్తి నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మహిళ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు మేమే చేస్తాం, ప్రారంభోత్సవాలు మేమే చేస్తామని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి మహిళా సమైక్య భవనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రియాజుద్దీన్,ఎంపీడీఓ కృష్ణవేణి, డిఈ జ్ఞానేశ్వర్ ఎంపీఓ శ్రీనివాస్,డిపిఎం వరలక్ష్మి,ఏఈ అనిల్,ఏపిఎం ఈశ్వర్, ప్రగతి మండల సమైక్య అధ్యక్షురాలు గట్టు రాధిక,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాడి శివ, నాయకులు కొమ్ము శ్రీకాంత్,సర్పంచులు దివ్యభారతి,స్వప్న,స్వరూప,వజ్ర రాజు, ధారావత్ జ్యోతి,వీరేందర్, సుభాష్ గాలి యాకయ్య, మహిళా సంఘ అధ్యక్షురాలు,విఓఏలు తదితరులు పాల్గొన్నారు.

