అత్తింటి వారు బైక్ కొనివ్వలేదని ఘాతుకం
భార్యను చంపి.. ఆతర్వాత భర్త ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా మారేపల్లి గ్రామంలో విషాదం
కాకతీయ, సంగారెడ్డి : అదనపు కట్నం వేధింపులు, బైక్ కొనివ్వలేదనే వివాదం ఒక పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. అత్తింటి వారు బైక్ కొనివ్వడం లేదనే కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య (25) అనే యువకుడికి, 11 నెలల కిందట యాదమ్మ (20) అనే యువతితో వివాహమైంది. పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ బాగానే ఉన్నారు. జీవనోపాధి కోసం అంజయ్య మారేపల్లి శివారులోని ఒక మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఆ తోటలోనే ఒక చిన్న తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉంటూ మామిడి పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా అంజయ్య తన అత్తింటి వారిని కొత్త బైక్ కొనివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. బైక్ కొనివ్వడం లేదనే నెపంతో భార్య యాదమ్మతో తరచూ గొడవ పడుతూ వేధించసాగాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా భార్యాభర్తల మధ్య బైక్ విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంజయ్య.. విచక్షణ కోల్పోయి భార్య యాదమ్మను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత భార్య మరణించిందనే భయంతోనో, లేక తప్పు చేశాననే పశ్చాత్తాపంతోనో కానీ.. అంజయ్య కూడా అదే మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకేసారి భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో మారేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


