గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ జరిపించాలి
మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి డిమాండ్
కాకతీయ,శంకరపట్నం: కరీంపేట గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు అందజేసి, గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు బిల్లులు సమర్పించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తిరుపతి తన ఫిర్యాదులో ఆరోపించారు. సంబంధిత అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ పాలకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన బిల్లులపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని గాండ్ల తిరుపతి కోరారు. విచారణ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు

