పల్లెప్రకృతి వనంలో చెట్లు నరికివేత!
కాకతీయ, పెద్దవంగర : మండలంలోని పడమటి తండా గ్రామంలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్లను ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అడ్డగోలుగా నరికివేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బీఆర్‌ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ రకాల మొక్కలను నాటారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సర్పంచ్, నాయకులు పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్న సాకుతో, ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చెట్లను నరికి వేస్తున్నారు. కనీసం ఫారెస్ట్ అధికారుల అనుమతి కూడా తీసుకోకుండా, నరికిన చెట్లను అక్రమంగా విక్రయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్య సమస్యల వల్లే మార్పు
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, వనంలో కోనోకార్పాస్ చెట్లు ఉండడం వల్ల తమకు శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారమే వాటిని తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. నరికివేసిన చెట్ల స్థానాల్లో త్వరలోనే ప్రజలకు మేలు చేసే పండ్లు, పూలమొక్కలను నాటుతామని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు.

