ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి!
మణుగూరు డిపో ఎదుట కార్మికుల ఎర్ర బ్యాడ్జీల నిరసన
జూన్ 2న విలీన ప్రకటన చేయాలని డిమాండ్
ప్రభుత్వానికి మణుగూరు డిపో జేఏసీ విజ్ఞప్తి
కాకతీయ, మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని మణుగూరు డిపో జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం మణుగూరు డిపోలో ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విలీన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆర్టీసీ కార్మికులు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఇంకా నెరవేరకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు శుభవార్త అందించి, అధికారికంగా విలీన ప్రకటన చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడం ద్వారానే సంస్థ మరింత బలోపేతం అవుతుందని, అలాగే కార్మికులకు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికుల ఆకాంక్షలను గౌరవించి తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మణుగూరు డిపోకు చెందిన పవన్ కుమార్, మురళి, కుంచె అశోక్, శ్రావణి, సందీప్, వెంకటేశ్వర్లు, పూర్ణ, రాంబాబు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

