‘రుద్రమ’ బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తేవాలి!
తెలంగాణ మహిళా ఆత్మగౌరవంలో ల్యాదల్ల హబ్ కొత్త అధ్యాయం
మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు సహకారం
నిజాయితీ పెట్టుబడిగా ‘పరకాల ఇందిరా మహిళా డైరీ’
మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా ల్యాదల్ల గ్రామంలో ప్రారంభమైన “రుద్రమ” బ్రాండ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మహిళలు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పరకాల స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో ఉత్పత్తులకు “రుద్రమ” బ్రాండ్ పేరు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఈ బ్రాండ్ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.

మహిళల ఆర్థిక సాధికారతే పునాది
హబ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎమ్మెల్యే రేవూరి సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, వారి జీవితాల్లో ఆర్థిక భరోసా నింపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పరకాల స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ఇందిరా మహిళా డైరీ
మహిళా సోదరిమణుల్లో కమిట్మెంట్తో పనిచేసే శక్తి అపారంగా ఉందని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక రంగంలో అద్భుత విజయాలు సాధించవచ్చని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళల ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నిజాయితీ, నిబద్ధతలను పెట్టుబడిగా తీసుకుని “పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్”ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామిక ప్రగతికి ఈ హబ్ కీలక వేదికగా మారుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

