నేను రైతు బిడ్డను కాను
రైతుల సమస్యలను తెలుసుకుని మార్కెట్ అభివృద్ధి చేస్తా
ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్ యార్ర ప్రియాంక
ఏనుమాముల మార్కెట్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
మూడేండ్ల తర్వాత కొలువుదీరిన కొత్త పాలకవర్గం
జీరోదందా అరికట్టడం కొత్త కమిటీ ముందున్న సవాల్
కూరగాయల మార్కెట్‌లో బినామీల ఏరివేతపై దృష్టి పెట్టాలి
కాకతీయ, వరంగల్ : తాను రైతు బిడ్డను కాకపోయినా రైతుల సమస్యలను పూర్తిగా తెలుసుకుంటానని, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చైర్పర్సన్ యార్ర ప్రియాంక పేర్కొన్నారు. బుధవారం వైస్ చైర్మన్ బండి జనార్ధన్, కొందరు సభ్యులతో కలిసి ఆమె మార్కెట్ కు చేరుకున్నారు. ఉత్తర్వుల కాపీని ఇన్చార్జ్ కార్యదర్శి మల్లేశానికి అప్పగించి, అనంతరం రిజిస్టర్ లో సంతకం చేసి పదవీ బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కు తనను చైర్పర్సన్ గా నియమించిన పార్టీ పెద్దలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
యార్ర ప్రియాంకకు చైర్పర్సన్ పదవి దక్కడంలో ఆమె భర్త అనిల్ కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీకి అనువాదకుడిగా పనిచేసిన అనిల్ పైరవీయే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే ప్రియాంక చైర్పర్సన్ గా పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించినా స్థానిక రాజకీయాల నేపథ్యంలో అప్పట్లో కమిటీ నియామకం వాయిదా పడింది. తిరిగి ఒక్కరి పేరు మార్పుతో పాత కమిటీనే ప్రభుత్వం తాజాగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త కమిటీ ముందు సవాళ్లు
ఏనుమాముల మార్కెట్ కు పాలకవర్గం లేక మూడేండ్లు అవుతోంది. గత పాలకవర్గం కాలపరిమితి 2023 ఆగస్టు 16న ముగియడంతో అప్పటి నుంచి మార్కెట్ వ్యవహారాలు అధికారుల చేతుల ద్వారానే సాగుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో మార్కెట్ అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్ లో జీరోదందా విచ్చలవిడిగా జరుగుతోందని, సూపర్వైజర్లు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. యార్డుల నిర్వహణ లోపాలు, రైతులకు అరకొర సౌకర్యాలు కొత్త కమిటీకి సవాల్‌గా మారనున్నాయి.
నిలిచిన మార్కెట్ పనులు
పండ్ల మార్కెట్ లేకపోవడంతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతోంది. పాత గ్రెయిన్ మార్కెట్ లో అసంపూర్తి మోడల్ మార్కెట్ నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. అసంపూర్తిగా మిగిలిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం వరంగల్ బల్దియా ఆధీనంలోనే ఉంది. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ లోనూ అడుగడుగునా సమస్యలు ఉన్నాయి. లక్షల రూపాయల మార్కెట్ ఫీజు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బినామీల ఏరివేత కోసం ఐడీ కార్డులు జారీ చేస్తామన్న హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. వీటిపై కొత్త పాలకవర్గం ఎలా దృష్టిసారిస్తుందో చూడాలి.

