సమాచార కమిషన్ కొరడా
తునికాకు నిధుల వివరాలు మూడు రోజుల్లోగా ఇవ్వాలి
రూ.90లక్షల అక్రమాలపై విచారణకు సూచన
సమాచారం ఇవ్వకపోతే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవు
అక్రమాలు తేలితే బాధ్యుల నుంచి రికవరీ చేయాలి
సమాచార హక్కు చట్టం ద్వారా నిరంతర పోరాటం
అటవీ శాఖ అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశం
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 2023 తునికాకు సీజన్‌కు సంబంధించిన నిధుల ఖర్చుపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. మూడు రోజుల్లోపు కోరిన సమాచారాన్ని అందించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలను అమలు చేయకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాదరి సురేష్ సమాచార హక్కు చట్టం–2005 కింద తునికాకు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను కోరగా సంబంధిత అధికారులు సమాచారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.
రూ.90లక్షల అక్రమాలు
విచారణ సందర్భంగా సమాచారాన్ని ఇవ్వకుండా జాప్యం చేసిన విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పందించిన సమాచార కమిషన్ కోరిన సమాచారాన్ని తక్షణమే అందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడైంది. అదే సమయంలో తునికాకు నిధుల వ్యవహారంలో సుమారు రూపాయలు 90 లక్షల మేర ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఉన్న ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తేలితే బాధ్యుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే చర్యలు చేపట్టాలని అటవీ శాఖను ఆదేశించింది.
ప్రోత్సాహక అవార్డుకు సిఫారసు
ప్రజా సమస్యలపై సమాచార హక్కు చట్టం ద్వారా నిరంతర పోరాటం చేస్తున్న మాదరి సురేష్ కృషిని గుర్తించిన కమిషన్ ఆయన వివరాలను ములుగు జిల్లా కలెక్టర్‌కు పంపించి ప్రోత్సాహక అవార్డుకు సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నట్లు తెలిసింది. తునికాకు నిధుల వ్యవహారంపై సమాచార కమిషన్ జోక్యం చేసుకోవడం అక్రమాల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ కావడం ఏటూరునాగారం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం మరోసారి ప్రభావవంతమైన సాధనంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

