వర్షకాలంపై ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలి
వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాకతీయ, దుగ్గొండి : వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, వరద నివారణపై అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామసభలో ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ, వరద నిర్వహణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసిల్దార్ ముస్కు సమ్మక్క, ఆర్ఐ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ వాజిద్, జీపీవోలు విక్రమ్, రమేష్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

