బెల్లంకొండ మల్హర్ రావు 37వ వర్ధంతి
కొయ్యూర్ కూడలిలో విగ్రహానికి పూలమాల వేసి నివాళి
ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తాం: మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్
కాకతీయ, మల్హార్ : మండల అభివృద్ధి ప్రదాత, స్వర్గీయ బెల్లంకొండ మల్హర్‌రావు 37వ వర్ధంతి వేడుకలు మల్హార్ మండలంలో ఘనంగా జరిగాయి. వర్ధంతి సందర్భంగా కొయ్యూర్ ప్రధాన కూడలిలో ఉన్న మల్హర్ రావు విగ్రహానికి మండల మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కోసం ఒక సైన్యంలో పోరాడిన వ్యక్తి మల్హర్ రావు అని కొనియాడారు. ఆనాడు సర్పంచ్‌గా మల్హర్‌రావు మండల అభివృద్ధికి గట్టి బీజం వేశారని గుర్తు చేశారు. నాగులమ్మ ఆలయం నుండి మల్లారం తాడిచర్ల వరకు రోడ్ల నిర్మాణం కోసం నాడు అధికారులను సైతం ఎదిరించారని, ప్రజల అవసరాల కోసం ఎవరినైనా ఎదిరించవచ్చనే గొప్ప సూక్తిని చాటారన్నారు. ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాడిన కొమురం భీం స్ఫూర్తితో మల్హర్‌రావు ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అడవులు అడ్డంగా ఉన్నా లెక్కచేయకుండా రోడ్ల నిర్మాణం చేయించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందన్నారు. మల్హర్‌రావు ఆలోచనలను, ఆశయాలను మండల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజల కోసం జీవించే నాయకులకు, ప్రజలను వాడుకునే వారికి ఉన్న తేడాను గుర్తించనంత కాలం చీకట్లోనే ఉంటామని వ్యాఖ్యానించారు. మల్హర్‌రావు ఆశయ సాధన కోసం తాను నిరంతరం కృషి చేస్తానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

