కనిపించకుండా పోయి..అడవిలో శవాలై..
ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు
అటవిలో ఉరేసుకుని బలవన్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
టేకులగుంట అడవిలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహాలు లభ్యం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని టేకులగుంట అటవీ ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా కనిపించకుండా పోయిన ప్రేమ జంట, అడవిలో ఒక చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహాలుగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. టేకులగుంట గుత్తికోయ గూడానికి చెందిన కాసారపు కోమల (18), కురం ఇరువయ్య (18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతీయువకులు సుమారు రెండు నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. కూతురు కనిపించకపోవడంతో కోమల తండ్రి బూదారయ్య ఈ ఏడాది ఏప్రిల్ 11న పస్ర పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు, కుటుంబ సభ్యులు వారి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం టేకులగుంట అటవీ ప్రాంతంలో పశువుల కాపరులకు ఒక చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించడంతో వారు వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పస్ర సబ్ ఇన్స్పెక్టర్ తాజుద్దీన్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కిందకు దించి పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ఘటనతో గుత్తికోయ గూడంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాన్ని కుటుంబాలు అంగీకరించకపోవడమే ఈ దారుణానికి కారణమా? లేక దీని వెనుక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

