ఆపదలో అండగా సీఐ రాజగోపాల్
రోడ్డు ప్రమాద బాధితుడికి సాయం
ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటిన పోలీస్ అధికారి
వైద్య సేవలు అందేలా స్వయంగా పర్యవేక్షణ
ప్రశంసలు అందుకుంటున్న పర్వతగిరి సీఐ
కాకతీయ, వరంగల్ సిటీ: బాధ్యతను మించిన మానవత్వంతో పర్వతగిరి సీఐ రాజగోపాల్ రోడ్డు ప్రమాద బాధితుడికి సకాలంలో అండగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు. హంటర్ రోడ్డులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టారు. బుధవారం హంటర్ రోడ్డు నుంచి విధులకు వెళ్తున్న సమయంలో జేఎస్ఎం కళాశాల సమీపంలో కారు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిఉండటం సీఐ రాజగోపాల్ గమనించారు. వెంటనే తన ప్రయాణాన్ని నిలిపివేసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పర్యవేక్షణ
గాయపడిన వ్యక్తిని ఆటోలో ఎక్కించి పంపించడమే కాకుండా, స్వయంగా అదే ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితుడికి అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంతో ఆందోళనకు గురైన దంపతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు జరిగినా పట్టించుకోకుండా వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్న వేళ, సకాలంలో స్పందించి ప్రాణ రక్షణకు కృషి చేసిన సీఐ రాజగోపాల్ మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఆయన చర్యలు పోలీసు శాఖ సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయని స్థానికులు పేర్కొంటున్నారు.

