ప్రతి ఇంటా మొక్కలు.. ప్రతి గ్రామం పచ్చదనం
ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపు
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అవగాహన
ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు
కాకతీయ, గీసుగొండ : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇల్లాలు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్–2026పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీడీఓ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక గ్రామసభల్లో భాగంగా గీసుగొండ మండలంలోని 21 గ్రామాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నాలుగు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపీడీఓ తెలిపారు. బుధవారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పాల్గొని గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు.
చెత్త వేరు చేసి అందించాలి
బొడ్డు చింతలపల్లి సర్పంచ్ పోగుల వనిత మాట్లాడుతూ మొక్కల పెంపకం మానవ మనుగడకు ప్రాణాధారమని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలోని డంపింగ్ యార్డును సందర్శించి కంపోస్ట్ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. శాయంపేట హవేలీలో తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, వంచనగిరిలో వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు, ఊకల్ హవేలీలో ఎంపీఓ పాక శ్రీనివాస్ పాల్గొని ప్రగతి ప్రణాళిక పనులను పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు పోగుల వనిత, కక్కెర్ల సుభాష్, గాలి యాకయ్య, కొమ్ముల కోమల, పంచాయతీ కార్యదర్శులు ఆనంద్, సుధాకర్, రజిత, సునీల్, అనిల్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

