యూపీఐ లంచాల గుట్టురట్టు
బిల్లుల క్లియరెన్స్ పేరుతో అక్రమ వసూళ్లు
ఏసీబీకి చిక్కిన సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్
కాకతీయ, కరీంనగర్: బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్ల నుంచి యూపీఐ ద్వారా లంచాలు వసూలు చేస్తున్న జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాధికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఐసీడీఎస్‌కు కోడిగుడ్లు, పప్పులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి రూ.2.37 లక్షలకుపైగా అక్రమంగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాంట్రాక్టర్ల బిల్లులను త్వరగా క్లియర్ చేయడం, పెండింగ్ ఫైళ్లను ముందుకు కదిలించడం కోసం రాధిక డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు రూపంలో కాకుండా యూపీఐ లావాదేవీల ద్వారా డబ్బులు స్వీకరించినట్లు, కొన్ని చెల్లింపులు బినామీ ఖాతాల ద్వారా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
బినామీ ఖాతాలపై ఆరా
అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అనంతరం రాధికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా, గతంలో కూడా ఇదే తరహాలో వసూళ్లు జరిగాయా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉండగా, విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

