మహిళా సర్పంచ్‌పై దాడి
నిందితులను అరెస్ట్ చేయాలని నిరసన
సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ప్రదర్శన
దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు
అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న వారిపై చర్యలకు డిమాండ్
కాకతీయ, నూగూరు వెంకటాపురం : మొర్రవానిగూడెం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ శ్యామల వినీతపై దాడి చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామస్తులు, సీపీఎం నాయకులు మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శివాలయం నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సర్పంచ్ పై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నత అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని కోరారు. గత ఎన్నికల ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని, గ్రామాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
అభివృద్ధికి అడ్డంకులు తగదు
సర్పంచ్ శ్యామల వినీత మాట్లాడుతూ, గ్రామానికి మంజూరైన మహిళా సమైక్య భవనం, రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించబడ్డాయని తెలిపారు. వీటి కోసం వ్యవసాయేతర భూములను సర్వే చేయించి పంచాయతీకి స్వాధీనం చేయాలని, దీనిపై త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు తమ పద్ధతులను మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు కుమ్మరి శీను, గ్రామస్తులు తోట నాగేశ్వరరావు, వాదం బుచ్చయ్య, వాదం శీను, బొల్లె వెంకట్రావు, కోటేష్, దేవుడు, మోహన్ రావు, చంటి, ఎం. ధనలక్ష్మి, అరుణ కుమారి, జానకమ్మ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

