మోదీ పాలనలో విశ్వగురువుగా భారత్
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఆవిర్భావం
రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు
‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి
సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు నేరుగా లబ్ధి
అవినీతి రహిత పాలనతో దేశ కీర్తిని దశదిశలా చాటిన మోదీ
బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
కాకతీయ, పెద్దపల్లి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించిందని, భారత్ నేడు విశ్వగురువుగా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో అవినీతి, విధానపరమైన స్థబ్ధతతో సతమతమైన దేశాన్ని, నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని సురేష్ రెడ్డి అన్నారు. త్వరలోనే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని, రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని వివరించారు.
మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణతో మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా పేదలకు, రైతులకు, మహిళలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని వారు వివరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతీయుల శతాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిందని, అంతరిక్ష రంగంలో చంద్రయాన్, గగన్యాన్ వంటి విజయాలు భారత్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశాయని వారు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ శివంగారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు అమరాగాని ప్రదీప్ కుమార్, దాడి సంతోష్, కందుల శ్రీనివాస్, బెజ్జంకి దిలీప్, రామగిరి అఖిల్, బుతాగడ్డ రాజ్ కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

