ప్రజా సంక్షేమమే ధ్యేయం
పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో వెలుగులు
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు
మహిళా సంఘాలతో ఆర్థిక స్వావలంబన
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా నిలుస్తుందని, పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గ్రామీణ పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మల్లంపల్లి మండలంలోని ముద్దునూరు తండ గ్రామంలో శుక్రవారం రూ.1 కోటి వ్యయంతో 30 ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు, శంకుస్థాపన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి, లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
నిరంతరంగా ఇండ్ల మంజూరు ప్రక్రియ
ముద్దునూరు తండ గ్రామంలో మొదటి విడతలో 6 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, రెండో విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 24 ఇండ్లను ఎంపిక చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నూతన పెన్షన్ల పంపిణీ కూడా చేపడతామని తెలిపారు. స్థానిక అభివృద్ధి పనులు, గ్రామ సమస్యలను సర్పంచుల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మహిళా సంఘాలతోనే ఆర్థికాభివృద్ధి
ప్రతి మహిళ తప్పనిసరిగా మహిళా సంఘాల్లో సభ్యురాలిగా చేరాలని, మహిళా సంఘాల ద్వారా అనేక ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని, మహిళలు సంఘాల్లో చేరితే ఇంట్లోనే ఒక బ్యాంక్ ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి., ఎం. సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

