నర్సంపేటలో ‘మట్టి’ మాఫియా రాజ్యం
అధికార పార్టీ అండదండలతో సహజ వనరుల దోపిడీ
అధికారులపై దాడులు పాలకపక్ష అహంకారానికి నిదర్శనం
మట్టి తవ్వకాల దందాపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రశ్నించిన అధికారులపై దాడులు జరిగినా ఎమ్మెల్యే మౌనం ఎందుకు?
నర్సంపేటలో పరి పాలన పూర్తిగా గాడి తప్పింది
మట్టి దందాలో భాగస్వాములపై ఉక్కుపాదం మోపాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్
కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోందని, సహజ వనరుల దోపిడీకి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సంపదను కొందరు కాంగ్రెస్ నాయకులకు అప్పగించి దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. మట్టి, మొరం దందాలు బహిరంగంగా సాగుతున్నా ప్రభుత్వం, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోందని సుదర్శన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి మట్టి అనుమతులు ఇచ్చారు, ఎంత మట్టి తరలించారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నెక్కొండ మండలంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల పేరుతో పరిమిత అనుమతులు తీసుకుని, భారీగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు.
అధికారులకే రక్షణ లేని పాలన
మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన అధికారులపైనే దాడులు జరగడం దారుణమని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బందిపై దాడులు జరిగినా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ఈ మౌనం దాడులకు పరోక్ష మద్దతుగా భావించాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. రంగయ్య చెరువు, రాజుపేట ప్రాంతాల్లో జరిగిన మట్టి తవ్వకాలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అటవీ శాఖ పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఇతర శాఖలు ఎలా అనుమతులు జారీ చేశాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఒక శాఖపై మరో శాఖ ఫిర్యాదులు చేసుకునే స్థాయికి పాలన దిగజారిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఉక్కుపాదం మోపాలి
నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అధికారులకే రక్షణ లేని కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. అక్రమ మట్టి దందాలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వారిని వదిలిపెట్టరాదని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే మాఫియాలపై ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

