ఉద్యోగుల ఆరోగ్యంపై సర్కారు కక్ష
హెల్త్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ కాలయాపన
ప్రభుత్వ ధోరణి ఇలాగే ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న సర్కారు
ఉద్యోగుల వేతనాల కోతపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తీవ్ర ఆగ్రహం
ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటానికి సిద్ధమని హెచ్చరిక
వెంటనే హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా, ఇప్పటికీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించకపోవడం దారుణమని విమర్శించారు. జూన్ 1 నుంచే హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన ఆరోపించారు.
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్ పథకాన్ని ఆసుపత్రులు నమ్మే పరిస్థితి లేదని, ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసేందుకు యాజమాన్యాలు అడ్మిట్ చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగి జీతం నుండి నెలకు రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు డబ్బులు కట్ చేస్తున్నారని, ఈ డబ్బులు కట్ చేయమని ప్రభుత్వానికి చెప్పింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎవరైనా చనిపోతే దానికి పూర్తి బాధ్యత సర్కారుదేనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే, ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరిక చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు తూట్లు
కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగుల అనుమతి లేకుండానే మే నెల వేతనాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఉద్యోగి సమ్మతి లేకుండా జీతం కట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా, ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. హెల్త్ కార్డుల విషయంలో గందరగోళం సృష్టిస్తూ, అసలు ఏయే ఉద్యోగులు ఈ పథకం పరిధిలోకి వస్తారో కూడా స్పష్టత లేదని విమర్శించారు. పోలీసుల జీతాల నుంచి ఇప్పటికే కట్ అవుతున్నా, మళ్లీ అదనంగా కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యోగులకు గౌరవం
కేసీఆర్ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందించామని, ఉద్యోగులను అపారంగా గౌరవించుకున్నామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. పీఆర్సీ విషయంలో ఆరు నెలల్లోనే క్లియర్ చేస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుందని, రెండున్నర ఏళ్లైనా ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. తమతో కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని, ఉద్యోగుల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో నిలబడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.

