సీఐల బదిలీలకు బ్రేక్..?!
వరంగల్ సీపీపై రాజకీయ ఒత్తిళ్లు..!
మా నియోజకవర్గంలో బదిలీలు వద్దంటూ ఎమ్మెల్యేల రిక్వెస్ట్
ఎందుకైనా మంచిదంటూ డీజీపీ వరకు ఫోన్లు..!
కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా సీఐల వ్యవహారం!
సీఐల బదిలీలపై ప్రజాప్రతినిధుల పూర్తి కమాండ్
కాలపరిమితి ముగిసినా అదే స్టేషన్లో సీఐల తిష్ట
సీపీ సిద్ధం చేసిన జాబితా అమలవుతుందా..
రాజకీయ ఒత్తిళ్లతో ఆ జాబితా అటకెక్కుతుందా..?
వరంగల్ కమిషనరేట్‌లో సీఐల బదిలీలపై హైటెన్షన్
కాకతీయ, నిఘా ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల (సీఐలు) బదిలీల వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఒకే పోలీస్ స్టేషన్లో మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ కమిషనర్ జాబితా సిద్ధం చేసినప్పటికీ, రాజకీయ జోక్యాల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కాలపరిమితి పూర్తి చేసుకున్న సీఐల వివరాలను సేకరించి బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరగాల్సిన ఈ బదిలీలు చివరి దశకు చేరుకున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయని శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో జరిగిన పోస్టింగ్‌ల సమయంలో కొందరు సీఐలు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తమకు అనుకూలమైన స్టేషన్లలో నియామకాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బదిలీల సమయంలో కూడా అదే ప్రభావం కనిపిస్తోందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

మా నియోజకవర్గంలో ఇప్పుడే బదిలీలు వద్దు..
తమ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న కొందరు సీఐలు స్థానిక రాజకీయ నాయకుల సూచనలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఉన్నతాధికారులను సంప్రదించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక ఎమ్మెల్యే స్వయంగా కమిషనర్‌ను కలిసి, తన నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న సీఐలను ప్రస్తుతానికి బదిలీ చేయవద్దని కోరినట్లు తెలుస్తుండటం గమనార్హం. బదిలీల జాబితా సిద్ధమైన విషయం బయటకు రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసినట్లు కూడా శాఖలో చర్చ జరుగుతోంది. కొందరు ప్రత్యేక స్టేషన్లలో కొనసాగుతున్న అధికారులను అలాగే ఉంచాలని, మరికొందరిని తమకు అనుకూల ప్రాంతాలకు పంపాలని సిఫార్సులు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం ఒకే స్టేషన్లో ఎక్కువకాలం పనిచేసే అధికారులను బదిలీ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టాలి. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఈ నిబంధన అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు అధికారులు నాలుగు, ఐదు సంవత్సరాలకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఆరోపణలున్నా చర్యలు లేవా..?
కొంతమంది సీఐలపై శాఖాపరమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమైంది. తోటి అధికారులతో విభేదాలు, సిబ్బందితో అనుచిత ప్రవర్తన, దిగువ స్థాయి అధికారులను వేధించడం వంటి ఆరోపణలు వచ్చినా బదిలీ చేయకుండా కొనసాగించడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సీఐ తన స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐతో తీవ్ర విభేదాలకు దిగడంతో పాటు, గతంలో అదే స్టేషన్ లో పని చేసిన ఎస్ఐ సస్పెన్షన్‌కు కూడా పరోక్ష కారణమయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సిఐ ఓ జాతరలో పని చేస్తున్న మరో సర్కిల్ ఇన్స్పెక్టర్తో కూడా బహిరంగ దూషించారనే విభేదాలు ఉన్నప్పటికీ ఎటువంటి పరిపాలనా చర్యలు తీసుకోకపోవడం చర్చకు దారి తీసింది. కొన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మధ్య అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. కాలపరిమితి ముగిసినా బదిలీ ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నను సిబ్బందే పరస్పరం చర్చించుకుంటున్నారని సమాచారం. కొందరు అధికారులు వెళ్లిపోతారని భావించిన సిబ్బంది, బదిలీలు నిలిచిపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లోనూ చర్చ..
సంబంధిత స్టేషన్లకు వచ్చే ప్రజలు, స్థానిక నాయకులు, సామాజిక వర్గాలు కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఒకే అధికారి ఎక్కువకాలం ఒకే ప్రాంతంలో కొనసాగడం వల్ల పరిపాలనా పారదర్శకత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన బదిలీల జాబితాను అమలు చేస్తారా?, లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మరికొంతకాలం వాయిదా వేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టి పోలీస్ శాఖ స్వతంత్రతను చాటుతుందా, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐల బదిలీల అంశం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజల మధ్య కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

