బాధిత కుటుంబాలకు అండగా ఇనగాల
మృతుల కుటుంబాలకు పరామర్శ
కాకతీయ, హనుమకొండ : వరంగల్ కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం వివిధ కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయి తీరని విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంగెం మండలం రామచంద్రాపురం ఎంపీటీసీ సభ్యుడు చిదురాల రాజు సోదరుడు చిదురాల అగ్గిరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి చేరుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అగ్గిరాజు మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఆ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, వర్ధన్నపేట నియోజకవర్గం పెగడపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ సభ్యుడు గాదె విజయ్ కుమార్ రెడ్డి మాతృమూర్తి పుష్ప శనివారం మరణించగా, ఆదివారం వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం ప్రజాప్రతినిధులు, నాయకుల బాధ్యతని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

