భార్యకు పెళ్లి చేసిన భర్త
పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్
మహిళను కలిసేందుకు ఇంటికి వెళ్లిన ప్రియుడిని పట్టుకున్న స్థానికులు
తామిద్దరం ప్రేమించుకుంటున్నామని పోలీసుల విచారణలో వెల్లడించిన యువకుడు
భార్యను తన బంధం నుంచి విముక్తి చేసి ప్రియుడితో పెళ్లికి అంగీకరించిన భర్త
గ్రామస్తుల సమక్షంలో దగ్గరుండి మరీ భార్యకు రెండో వివాహం
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీహార్‌లోని నలంద జిల్లా కత్వార్‌సల్పూర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ వివాహిత, తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ ఇద్దరి ఎఫైర్ గురించి ఇటీవల గ్రామస్తులకు తెలిసింది. ఈ క్రమంలో మహిళను కలిసేందుకు యువకుడు ఆమె ఇంటికి వెళ్లగా, స్థానికులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలను విచారించారు. ఈ విచారణలో తామిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నామని, సదరు వివాహితను తానే పెళ్లి చేసుకుంటానని 24 ఏళ్ల యువకుడు పోలీసుల ఎదుట బహిరంగా ప్రకటించాడు. తన భార్యకు మరొకరితో ఎఫైర్ ఉందనే నిజం తెలుసుకుని మొదటి భర్త తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ఆమె ప్రవర్తన చూశాక ఇకపై ఆమెతో కలిసి బంధాన్ని కొనసాగించలేనని అధికారులకు స్పష్టం చేశాడు. భార్య మనోభావాలను అర్థం చేసుకున్న భర్త, ఆమెను బలవంతంగా తనతో ఉంచడం ఇష్టం లేక ప్రియుడితో పెళ్లి చేయడానికి అంగీకరించాడు. దాంతో ఆలస్యం చేయకుండా గ్రామ పెద్దలు, స్థానికుల సమక్షంలో భర్త స్వయంగా దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె ప్రియుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరిపించాడు. ఈ అరుదైన పెళ్లిని చూసేందుకు స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

