ఖమ్మం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి
రజక సంఘం నాయకుడు నాంపెల్లి శంకరయ్య డిమాండ్
కాకతీయ,శంకరపట్నం: ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని రజక సంఘం మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాంపెల్లి శంకరయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మొలంగూర్ గ్రామంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.10 లక్షలు మంజూరు చేయడంతో పాటు, బాలిక భవిష్యత్తు కోసం ఆమె పేరుపై రూ.1 కోటి బ్యాంకులో డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటన కారణంగా బాలిక భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు రజక సంఘం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పందించి బాధిత కుటుంబానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దండు సాయిలు, గ్రామ ఉప సర్పంచ్ దండు రాజేష్, రజక సంఘం నాయకులు తాడిచెర్ల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

