ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య
కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగ ఒత్తిడిని తట్టుకోలేక గంజి కీర్తన (25) అనే యువతి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీర్తన బెంగళూరులోని ఒక విదేశీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. గత కొంతకాలంగా ఉద్యోగ ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఆమె తండ్రి గంజి ఉమాశంకర్ వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, తల్లి కృష్ణవేణి గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లారు. ఇంట్లో కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యం జరిగింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, తలుపులు లోపలి నుంచి గడిపెట్టి ఉండటాన్ని గమనించి కిటికీ ద్వారా చూడగా కీర్తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నితో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి కీర్తనను కిందకు దించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీర్తన మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.
ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

