పేదల జోలికి వస్తే ఊరుకోం
బాధితులకు అండగా పోరాటం కొనసాగిస్తాం
20 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్క గుడిసెను కూడా కూల్చనివ్వలేదు
పేదలకు ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
తనపై అసత్య ఆరోపణలు చేసేవారికి చిత్తశుద్ధి లేదు
వైఎస్ఆర్ నగర్ కాలనీ వాసుల సమస్యలపై దాస్యం వినయ్ భాస్కర్
ఎమ్మెల్యే నాయినిరాజేందర్‌రెడ్డిని ఉద్దేశించి ధ్వజం
కాకతీయ, హనుమకొండ : ఏ వర్గానికి హాని కలిగించని అభివృద్ధిని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే పేదలకు అన్యాయం చేసే ఏ చర్యలనైనా సహించేది లేదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. కాజీపేటలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలిచానని, ఒక్క గుడిసెను కూడా కూల్చనివ్వలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ నగర్, చెరబండ రాజు కాలనీ వాసుల సమస్యలపై మాట్లాడుతూ, పేదలను ఖాళీ చేయించే ముందు వారికి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
నాపై అసత్య ఆరోపణలు చేసేవారికి చిత్తశుద్ధి లేదు
తనపై అసత్య ప్రచారాలు, అవినీతి ఆరోపణలు చేసేవారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిజానికి ఎన్ఐటీ సమీపంలోని భూములను కబ్జా చేసిన వారే ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి కేసులు పెడుతున్నారని, తనపై పెట్టిన కేసులు కొత్తేమీ కాదని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎల్లప్పుడూ బాధితుల పక్షాన ఉంటారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చివరదాకా పోరాడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.

