ప్రైవేటు పాఠశాలల ‘దోపిడీ’
నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని యాజమాన్యాల బలవంతం
గరిష్ఠ ధరలతో పుస్తకాల విక్రయాలు.. తల్లిదండ్రులపై పెనుభారం
పుస్తకాల సెట్‌పై కమీషన్ల కోసం భారీగా ధరల పెంపు
అడిగితే ప్రభుత్వ బడిలో చేర్చుకోండంటూ నిర్లక్ష్యపు సమాధానాలు
విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు
కాకతీయ, మణుగూరు : భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించే సొమ్మును, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పెను కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి, యాజమాన్యాలు తమకు నచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో కమీషన్ల దందాకు తెరలేపడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు, ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులకు అసలు పొంతనే లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజుగా 15 వేల రూపాయలు అంటే, ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఏకంగా 35 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని వారు వాపోతున్నారు. “మేము చెప్పిన ఫీజు కట్టాల్సిందే, ఇష్టం లేకపోతే టీసీ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోండంటూ” యాజమాన్యాలు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకాలపై కమీషన్ల కక్కుర్తి
పాఠశాలల యాజమాన్యాలు నిర్దేశించిన నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు కొనాలని బలవంతం చేయడం మణుగూరులో పరిపాటిగా మారింది. బయట మార్కెట్లో 800 రూపాయలకే దొరికే పుస్తకాల సెట్‌ను, వీరు చెప్పిన దుకాణాల్లో 1800 రూపాయలకు కొనాల్సి వస్తోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలు, దుకాణదారులు కుమ్మక్కై తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, ఇదంతా కేవలం కమీషన్ల కోసమేనని వారు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల కమిటీ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. అలాగే, పుస్తకాలు, యూనిఫామ్‌లను తల్లిదండ్రులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ మణుగూరులో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్, అడ్మిషన్, యాన్యువల్ ఫీజుల పేరుతో ప్రతి తరగతికి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అధికారులు స్పందించాలి.. కోరుతున్న తల్లిదండ్రులు
ఫీజుల దోపిడీపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రైవేటు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని, నిర్బంధంగా పుస్తకాలు కొనిపించే విధానాన్ని ఆపాలని వారు కోరుతున్నారు. దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ నిద్ర వీడుతుందో లేదో వేచి చూడాలి.

