గర్భిణి చితాభస్మంలో కత్తెర..
వైద్యుల నిర్లక్ష్యానికి తల్లీబిడ్డ బలి?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సే చేసిన సాధారణ కాన్పు
అవగాహనా రాహిత్యంతో శిశువు మృతి.. తీవ్ర రక్తస్రావంతో బాలింత మరణం
అంత్యక్రియల అనంతరం సేకరించిన బూడిదలో బయటపడ్డ స్టీల్ కత్తెర
శస్త్రచికిత్స చేయలేదని, తమకు సంబంధం లేదని వైద్యాధికారుల వివరణ
విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్
కాకతీయ, గుండాల/ మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డల ప్రాణాలు బలిగొన్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, మరణించిన తల్లి అంత్యక్రియల అనంతరం శ్మశానంలో సేకరించిన చితాభస్మంలో శస్త్రచికిత్సకు వాడే స్టీల్ కత్తెర బయటపడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంభూనిగూడెం గ్రామానికి చెందిన వనజకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తక్షణమే గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, విధుల్లో ఉన్న నర్సే సాధారణ ప్రసవం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సు అవగాహనా రాహిత్యం మరియు నిర్లక్ష్యం కారణంగా శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. కాన్పు తర్వాత తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడిన వనజను మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి తరలించే లోపే ఆమె కూడా ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది.
చితాభస్మంలో శస్త్రచికిత్స కత్తెర
తల్లీబిడ్డల మరణంతో శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు శుక్రవారం వారికి అంత్యక్రియల కర్మకాండలు పూర్తి చేశారు. అనంతరం శ్మశానంలో చితాభస్మం సేకరిస్తుండగా, అందులో శస్త్రచికిత్సకు ఉపయోగించే స్టీల్ కత్తెర బయటపడడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యమే తమ అమ్మాయి, మనవడి ప్రాణాలు తీసిందని బాధితులు ఆరోపించారు. కాన్పు సమయంలో లోపల కత్తెర మరిచిపోయి కుట్లు వేశారని, అందుకే వనజ తీవ్ర రక్తస్రావంతో చనిపోయిందని బంధువులు బోరున విలపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యాధికారుల ఖండన.. విచారణకు డిమాండ్
ఈ తీవ్ర ఆరోపణలపై గుండాల ఆసుపత్రి వైద్యాధికారులు స్పందిస్తూ తమ తప్పేమీ లేదని సర్దిచెప్పుకున్నారు. ఆసుపత్రిలో కేవలం సాధారణ ప్రసవమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయలేదని స్పష్టం చేశారు. మరి చితాభస్మంలోకి ఆ కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని వారు చెబుతున్నారు. ఈ ఘోర ఉదంతంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

