మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం
యువత చదువు, క్రీడలతో ముందుకు సాగాలి
సమన్వయంతోనే మత్తు పదార్థాల నివారణ సాధ్యం
అవగాహన సదస్సులో నల్లబెల్లి ఎస్సై ప్రసన్నకుమార్
కాకతీయ, నల్లబెల్లి : మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, యువత వీటికి బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని నల్లబెల్లి ఎస్సై ప్రసన్నకుమార్ సూచించారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లబెల్లి మండలంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్‌లో ఆయన ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత చదువు, క్రీడలు, సానుకూల ఆలోచనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
మత్తు వ్యతిరేక సంతకాల సేకరణ
మత్తు పదార్థాల నివారణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మత్తు వ్యతిరేక సంతక కార్యక్రమం నిర్వహించారు. అలాగే ‘యాంటి డ్రగ్ సెల్ఫీ సోల్జర్’ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

