కాకతీయ ఎఫెక్ట్..
కదిలిన వ్యవసాయ, పోలీస్ శాఖలు
రైతన్న.. జర భద్రం కథనంతో తనిఖీలు
కాలం చెల్లిన మందులపై అధికారుల దాడులు
రైతుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన యంత్రాంగం
ఖరీఫ్‌కు ముందు కలకలం.. ఫెర్టిలైజర్ షాపులపై నిఘా..
తనిఖీల భయంతో మూతపడిన ఎరువుల దుకాణాలు..?
కాలం చెల్లిన పురుగుల మందుల గుట్టురట్టు దిశగా చర్యలు
ఇంకా పలు మండలాల్లో తనిఖీలు ప్రారంభం కాకపోవడంపై రైతుల ఆగ్రహం

కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ దినపత్రికలో ఈ నెల 19న ప్రచురితమైన రైతన్న.. జర భద్రం..! అనే ప్రత్యేక కథనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఖరీఫ్ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎరువులు, పురుగుల మందుల వ్యాపారులు కాలం చెల్లిన ఉత్పత్తులను రైతులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలను ఆధారాలతో వెలుగులోకి తీసుకురావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కథనం ప్రచురితమైన మూడు రోజుల వ్యవధిలోనే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించడం గమనార్హం. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమవడంతో రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు కాలం చెల్లిన పురుగుల మందులపై కొత్త స్టిక్కర్లు అతికించడం, గడువు ముగిసిన ఉత్పత్తులను నిల్వ ఉంచడం, నాసిరకం ఎరువులను విక్రయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నమ్మకంతో కొనుగోలు చేస్తున్న ఈ ఉత్పత్తులు పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కథనం వెలువడిన వెంటనే గీసుగొండ మండల వ్యవసాయ అధికారులు ఫెర్టిలైజర్ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో నిల్వ ఉంచిన పురుగుల మందులు, ఎరువుల స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, గడువు తేదీలను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఉత్పత్తుల వివరాలను నమోదు చేసి నమూనాలను సేకరించినట్లు సమాచారం. సోమవారం ఆత్మకూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అధికారుల రాకతో కొంతమంది వ్యాపారులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. దుకాణాల్లో నిల్వలు, బిల్లులు, కొనుగోలు రికార్డులు, అమ్మకాల వివరాలను పరిశీలించారు.
తనిఖీలకు ముందే షాపుల మూసివేత
పలు గ్రామాల్లో అధికారులు చేరుకునేలోపే కొంతమంది ఫెర్టిలైజర్ షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీల సమాచారం ముందుగానే కొందరికి చేరిందా? లేక అక్రమ నిల్వలు ఉన్నాయనే భయంతో షాపులు మూసివేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై కూడా అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల్లో ఇప్పటికీ తనిఖీలు ప్రారంభం కాలేదని రైతులు చెబుతున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కొంత కదలిక కనిపిస్తున్నప్పటికీ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోని అనేక మండలాల్లో ఇప్పటికీ ఎలాంటి ప్రత్యేక తనిఖీలు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కాలం చెల్లిన మందులు వాడి పంట నష్టపోతే బాధ్యత ఎవరిది?, రైతుల ప్రాణాల కంటే వ్యాపారుల లాభాలే ముఖ్యమా?, ప్రతి గ్రామంలో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కేవలం కొన్ని దుకాణాల వద్ద ఫొటోలు తీసి వెళ్లిపోకుండా, పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
కఠిన చర్యలు అవసరం
వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం గడువు ముగిసిన పురుగుల మందులు పంటలపై ఆశించిన ఫలితాలు ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. నకిలీ లేదా నాసిరకం ఎరువులు ఉపయోగించడం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడమే కాకుండా రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను రద్దు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, లీగల్ మెట్రాలజీ, డ్రగ్స్ కంట్రోల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తేనే అసలు అక్రమాలు బయటపడతాయని అభిప్రాయపడుతున్నారు.
కాకతీయ కథనంతో కదిలిన వ్యవస్థ..
సాధారణంగా రైతుల సమస్యలు వెలుగులోకి వచ్చినా స్పందన రావడానికి సమయం పడుతుంది. అయితే రైతన్న.. జర భద్రం..! కథనం వెలువడిన కొద్ది రోజులకే అధికారులు రంగంలోకి దిగడం పత్రికా కథన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అయిన ప్పటికీ కొన్ని మండలాల్లో తనిఖీలు ఇంకా ప్రారంభం కాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా సమగ్ర తనిఖీలు నిర్వహించి, కాలం చెల్లిన పురుగుల మందులు, నకిలీ ఎరువుల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతుల భద్రత, పంటల రక్షణ కోసం వ్యవసాయ శాఖ మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

