ఇసుక క్వారీల వద్ద తోపులాట..
టీఆర్ఎస్ నాయకులపై దాడి ఆరోపణలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఏటూరునాగారం ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన నాయకులు గోదావరిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు ఏటూరునాగారం మండలానికి వెళ్లారు. ఈ సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక క్వారీల వద్దకు వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్న నాయకులు, అక్కడే టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి, దాడికి దారితీసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నాయకుల సెల్‌ఫోన్లను లాక్కొని విసిరేసినట్లు ఆరోపిస్తున్నారు. వీడియోలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని వారు అంటున్నారు. మంగపేట మండలం వాడగూడెం వద్ద గోదావరి నదిలో, సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆరోపించారు. నదిని చెరబట్టి, నియంత్రణ లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు.

