జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ‘భూ పోరాటం’
స్థానికత విషయంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి
ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివినా స్థానికులా?
హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేస్తాం
మన బిడ్డల హక్కులను కాపాడటంలో వెనక్కి తగ్గేది లేదు
విజయవంతం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపు
ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించిన కవిత
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో చేపట్టనున్న ‘భూ పోరాటాన్ని’ విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్ భవన్ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ నుంచి జెండా గద్దె వరకు పాదయాత్ర నిర్వహించి, స్థానిక బస్తీ ప్రజలతో ముచ్చటించారు. జెండా ఆవిష్కరణ అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రతి ఉద్యమకారుడికి ఇంటి స్థలం సాధించడమే ధ్యేయంగా తాము ఈ భూపోరాటానికి పిలుపునిచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ స్థానికతపై మళ్లీ కుట్రలు
తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణలో 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉందన్నారు. దానికి విరుద్ధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ బిడ్డలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివినా సరే తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సులలో చేరవచ్చని, ఆ డిగ్రీలతో ఇక్కడ ఉద్యోగాలు దక్కించుకోవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంపై లీగల్ ఫైట్ చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇస్తే యావత్ రాష్ట్రం భగ్గుమందని, రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్‌ను కామన్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్‌ను బరిగీసి కొట్లాడి విరమింపజేశామని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్థానికత అంశంపై కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణను రక్షించేందుకు పుట్టిన పార్టీ అని, స్థానికత, ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
ఎంఎస్ మక్తాలో మొట్టమొదటి సారిగా పార్టీ జెండా ఎగురవేస్తున్నామని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటి, ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామని కవిత ధీమా వ్యక్తం చేశారు. అత్యంత పేదల పక్షాన తమ పార్టీ పోరాడుతుందన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ మక్తా వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, ఇక్కడి ప్రజలు నీళ్లు, డ్రెయినేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల్లో ఉండి వారికోసం పనిచేయాలని నాయకులకు సూచించారు. ఎంతో ప్రతిభ, కష్టపడే గుణం ఉన్నప్పటికీ మహిళలకు సరైన అవకాశాలు రావడం లేదని కవిత విచారం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన మహిళా సాధికారిత సదస్సులో ఆమె మాట్లాడారు. కొంచెం భిన్నంగా ఉండే మహిళలను ఇప్పటికీ అణిచివేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 15 నుంచి 19 ఏళ్ల వయసులోనే తల్లి అవుతున్న మహిళల సంఖ్య 7.2 శాతంగా ఉండగా, హైదరాబాద్ లాంటి నగరంలోనూ టీనేజ్ మదర్స్ సంఖ్య 2.7 శాతంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరుతుందనే తల్లిదండ్రుల ఆలోచనా విధానమే దీనికి కారణమన్నారు.
తెలంగాణ వచ్చాక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చుకున్నా ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదని, దీనికి కుటుంబాల సహకారం అవసరమని పేర్కొన్నారు. తాను ఏ విషయం మాట్లాడినా అంశాన్ని వదిలేసి జెండర్ బేస్డ్గా ట్రోల్ చేస్తున్నారని, ఇలాంటి వాటికి బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు.

