‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడి!
కాశీబుగ్గలో కుళ్లిన పచ్చళ్ల గుట్టురట్టు
అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పచ్చళ్ల తయారీ.. ఒకరి అరెస్ట్
రూ.2.25 లక్షల విలువైన 1,950 కిలోల కుళ్లిన నిల్వలు స్వాధీనం
చిన్న కిరాణా దుకాణాలే టార్గెట్‌గా కేటుగాడి వ్యాపారం
కాకతీయ,వరంగల్ బ్యూరో : వరంగల్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్లిపోయిన ముడిసరుకులతో పచ్చళ్లు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేంద్రం గుట్టురట్టు చేశారు. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో గల ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి, వీటిని చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరికెల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టన్నుల కొద్దీ కుళ్లిన ముడిసరుకు సీజ్
ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో కల్తీ నిల్వలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 750 కిలోల కుళ్లిన టమోటాలు, 900 కిలోల మామిడికాయలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలతో పాటు పచ్చళ్లలో వాడే 150 కిలోల నాణ్యత లేని అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. మార్కెట్‌లో వీటి మొత్తం విలువ సుమారు రూ.2.25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న కల్తీ సరుకును తదుపరి చట్టపరమైన క్రమశిక్షణా చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
బ్రాండ్ లేని పచ్చళ్లతో తస్మాత్ జాగ్రత్త!
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. మార్కెట్‌లో లభించే బ్రాండ్ లేని లేదా నాణ్యతా ప్రమాణాలు, ల్యాబ్ గుర్తింపు లేని పచ్చళ్లు, ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ, రసాయనాలతో కూడిన నిల్వలు లేదా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ చాకచక్యమైన దాడిని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.

