సీడీపీఓ ఆఫీస్ ముందు ‘ఆయా’ నిరసన!
అర్హత ఉన్నా ప్రమోషన్ ఇవ్వడం లేదని బండారి శారద ఆవేదన
మణుగూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు
న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు బాధితురాలి వేడుకోలు
కాకతీయ,మణుగూరు : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు అంగన్వాడీ టీచర్‌గా ప్రమోషన్ ఇవ్వకుండా అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మణుగూరు బండారిగూడెం సెంటర్-5లో పనిచేస్తున్న ఆయా బండారి శారద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన పదోన్నతిని కల్పించాలంటూ సోమవారం ఆమె మణుగూరులోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. తాను బండారిగూడెం సెంటర్-5లో ఆయాగా సుదీర్ఘ కాలంగా విధేయతతో విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం మణుగూరు సుందరయ్యనగర్‌లోని కుంకుడు చెట్టు గుంపు-2 సెంటర్లో అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని, నిబంధనల ప్రకారం సీనియారిటీ, అర్హతల ఆధారంగా ఆ పోస్టుకు తాను పూర్తి అర్హురాలినని తెలిపారు.
పట్టించుకోని ప్రాజెక్ట్ అధికారి
తాను అంగన్వాడీ టీచర్ ప్రమోషన్‌కు అర్హురాలినైనప్పటికీ, స్థానిక ప్రాజెక్ట్ అధికారి మాత్రం తన దరఖాస్తును ఏమాత్రం పట్టించుకోవడం లేదని శారద కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయమై గతంలోనే అధికారుల చుట్టూ తిరిగి పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన కరువైందని, విధిలేకే న్యాయం కోసం సీడీపీఓ ఆఫీస్ ముందు నిరసనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అర్హత ఉన్న తనకు అంగన్వాడీ టీచర్‌గా పదోన్నతి కల్పించి న్యాయం చేయాలని, ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు అండగా నిలవాలని శారద వేడుకున్నారు.

