కలెక్టరేట్‌లో అక్రమ ‘ఉద్యోగ’ పర్వం!
ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన
ఫోర్జరీ సంతకాలతో దొడ్డిదారిన ప్రభుత్వ ఉద్యోగం?
నిధుల శాఖ ఎంప్లాయీ ఐడీ జారీ వెనుక మతలబు
నోటిఫికేషన్ లేదు.. కారుణ్య నియామకం అసలే లేదు
నెలల తరబడి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు
మరో అక్రమ నియామక యత్నం బయటపెట్టిన పాత ఫైళ్లు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు వెలుగుచూశాయి. అర్హత, ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్ వంటి నిబంధనలేవీ లేకుండానే ఓ వ్యక్తి దొడ్డిదారిన ప్రభుత్వ ఉద్యోగిగా అవతారం ఎత్తడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, వ్యవస్థను మేనేజ్ చేస్తూ సాగించిన ఈ ‘ఉద్యోగ’ దందా, జిల్లా యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కలెక్టరేట్ కార్యాలయంలో కొద్ది నెలల క్రితం డైలీ వేజ్ ఉద్యోగిగా చేరిన సదరు వ్యక్తి, అనతి కాలంలోనే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోయాడు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ నియామకం చేపట్టాలంటే నోటిఫికేషన్ విడుదల చేయాలి లేదా కారుణ్య నియామకాల్లో ప్రత్యేక నిబంధనలను పాటించాలి. కానీ ఈ కేసులో ఎలాంటి రికార్డులు లేకుండానే సదరు వ్యక్తికి ప్రభుత్వ ఎంప్లాయీ ఐడీ జారీ కావడం గమనార్హం. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, అక్రమంగా ఫైల్ ఆమోదింపజేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఐడీ జారీ అయినప్పటి నుంచి గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెలా వేతనాలు కూడా అందుకుంటున్నట్లు సమాచారం.
నిధుల శాఖలో కుమ్మక్కు
ఒక ఉద్యోగికి ఎంప్లాయీ ఐడీ జారీ అయ్యే క్రమంలో నిధుల శాఖ (ట్రెజరీ) పలు స్థాయిల్లో పరిశీలన జరపాలి. సర్వీస్ రిజిస్టర్, నియామక పత్రాలు, ఉన్నతాధికారుల ధ్రువీకరణ వంటి అనేక దశలు దాటితేనే వేతనాల చెల్లింపు సాధ్యమవుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరాలు రాకుండా నిధుల శాఖలోని కొందరు సిబ్బంది అక్రమార్కులకు సహకరించినట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా ధ్రువీకరణలు లేని ఫైల్‌ను ప్రాసెస్ చేయడం, వేతన బిల్లులను ఆమోదించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి.
పాత ఫైళ్లతో బయటపడిన బాగోతం
ఈ అక్రమ నియామకంపై జిల్లా యంత్రాంగం అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో కలెక్టరేట్‌లోని మరో ఉద్యోగి తన కుమారుడికి కూడా ఇదే తరహాలో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆ ఫైల్ అప్పటి కలెక్టర్ దృష్టికి వెళ్లగా, అక్రమాలను గుర్తించి దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో సంబంధిత సిబ్బందిని మందలించినా, ఆ తర్వాత కూడా అదే తరహాలో అక్రమాలు కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిగ్గుతేలాలి..అక్రమాలు..!
ఫోర్జరీ సంతకాలతో జరిగిన ఈ నియామకం కేవలం పరిపాలనా లోపమా లేక క్రమబద్ధీకరించిన వ్యవస్థీకృత నేరమా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏయే అధికారుల సహకారంతో ఐడీ జారీ అయ్యింది, ఫోర్జరీ ఫైల్‌ను ఎవరు ఆమోదించారు, ఇప్పటివరకు విడుదలైన వేతనాల రికవరీ ఎలా చేస్తారనే విషయాలపై సమగ్ర విచారణ అవసరం. జిల్లా కలెక్టరేట్ వేదికగా జరిగిన ఈ అక్రమ నియామకాల వ్యవహారంపై విజిలెన్స్ లేదా ఏసీబీ స్థాయిలో విచారణ జరిపిస్తేనే, వ్యవస్థలోని లొసుగులు బయటపడతాయని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

