పెండింగ్ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలి
ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశం
కాకతీయ, ములుగు ప్రతినిధి : పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఆగస్టు నెల క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ భట్, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులను సమీక్షించిన ఎస్పీ, పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీరో ఎఫ్ఐఆర్ను సంబంధిత స్టేషన్కు బదిలీ చేసి, వెంటనే రీ-రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. సైబర్ నేరాల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల వివరాలను టిటీసీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నిబద్ధతతో పనిచేసిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సీఐలు దారం సురేష్, దయాకర్, సూర్యప్రకాష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఆర్ఐలు రాధారత్ స్వామి, తిరుపతి, వెంకటనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

