శెభాష్..సర్పంచ్ సాబ్..!
సర్పంచ్ రాఘవేంద్ర చొరవతో పాఠశాల పునఃప్రారంభం
సూర్యతండాలో గ్రామ పంచాయతీలో విద్యావెలుగులు
20 ఏళ్ల తర్వాత సాకారమైన గ్రామస్తుల కల
ప్రభుత్వ బడిని నిలబెట్టేందుకు వినూత్న పథకం
ఇంటి పన్ను, నల్లా పన్ను చెల్లింపునకు సర్పంచ్ ముందుకు
గ్రామస్థులు, తల్లిదండ్రుల నుంచి అనుహ్య స్పందన
కాకతీయ, గీసుగొండ: రెండు దశాబ్దాలుగా మూతపడిన సూర్యతండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సర్పంచ్ బానోతు రాఘవేంద్ర చొరవతో శుక్రవారం పునఃప్రారంభమై గ్రామస్థుల 20 ఏళ్ల కలను సాకారం చేసింది. గ్రామస్తుల సహకారం, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఈ పాఠశాల తిరిగి తెరుచుకుంది. మండలంలోని సూర్యతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పాఠశాలను వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, గీసుగొండ మండల విద్యాశాఖ అధికారి రవీందర్ కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన అధికారులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర మాట్లాడుతూ, గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత, ఉపాధ్యాయుల సేవాభావం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉదయం అల్పాహార పథకం వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించామని, తద్వారా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సర్పంచ్, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను, నల్లా పన్నును గ్రామ పంచాయతీకి తానే చెల్లిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు, గీసుగొండ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శరత్, సూర్యతండ ఉపసర్పంచ్ వాంకుడోత్ రాధా, గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరేష్ కుమార్, కాంగ్రెస్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు లావుడియా రాజన్న, వాంకుడోత్ అమర్ సింగ్, వాంకుడోత్ రాజు, బానోతు నర్సింగం, అజ్మీర నరసింహ, అజ్మీర సారయ్య, వాంకుడోత్ ఓంకార్, ఆంగోతు సక్రు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

