అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోకండి
పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి
అనుమతులు లేని వెంచర్లలో బోర్డుల తొలగింపు
అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
కాకతీయ, మలహర్: అక్రమ వెంచర్లలో ప్రజలు ఎవరూ ప్లాట్లు కొని మోసపోవద్దని తాడిచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాపురం శివారులో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ల బోర్డులను శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ప్లాట్లు కొనేముందు సంబంధిత గ్రామ పంచాయతీని సందర్శించి, అనుమతులు ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలని కోరారు. అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి మోసపోవద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

