భార్యకు వీడియో కాల్ చేసి..
లైవ్‌లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య!
ఆస్తి తగాదాలే కారణం.. పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి
కాకతీయ,కాజీపేట : వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, తన భార్యకు మొబైల్లో వీడియో కాల్ చేసి, అందరూ చూస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేష్ నాయక్ (45)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై తీవ్రస్థాయిలో మనస్పర్థలు, వివాదాలు జరుగుతున్నాయి. బంధువుల మధ్య ఈ వ్యవహారం సర్దుమణగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా ఆస్తి పంపకాల విషయమై భార్యతో రాజేష్ నాయక్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన ఆయన, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి కాజీపేట రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నారు.
వీడియో కాల్‌లోనే ఆత్మహత్య
అక్కడి నుంచి తన భార్యకు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడారు. తానేం చేయబోతున్నాడో లైవ్‌లో చూపిస్తూనే, రైలు కింద పడి రాజేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన భార్య మరియు కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

