ఇసుక దోపిడీని అరికట్టాలి
పేదలకు తక్కువ ధరలకు ఇసును అందజేయాలి
కమీషన్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల కుమ్మక్కు
స్థానిక ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు
జమ్మికుంటలో బీజేపీ నిరసన దీక్షలో నేతల ఆగ్రహం
కాకతీయ, జమ్మికుంట : కొత్తగా ఇండ్లు నిర్మించుకుంటున్న పేద ప్రజలకు ఇసుకను తక్కువ ధరకు, సులభతరంగా అందించాలని డిమాండ్ చేస్తూ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక అవసరాలకు ఇసుక దొరకక పేదలు పడుతున్న ఇబ్బందులపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల నుంచి స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు ఇసుకను తరలించడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే, తమకు మాత్రం దొరకకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లను పోలీసులు తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారని, దీనివల్ల దొడ్డిదారిన ఇసుక తెచ్చుకోవాల్సి వస్తోందని ట్రాక్టర్ యజమానులు వాపోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కమిషన్ల కోసం ఇసుక దందాకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ఒక ట్రాక్టర్ ఇసుకకు 7 నుంచి 8 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.
పోరాటాన్ని ఉధృతం చేస్తాం
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక ధరను తగ్గించాలని, స్థానిక పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే, ఇసుక ఇతర ప్రాంతాలకు తరలకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

