- ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
- మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్
- గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి పార్వతమ్మగూడెం వాసుల ప్రతిజ్ఞ
కాకతీయ, నెల్లికుదురు : సమాజంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ ఎదల్ల పూలమ్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.
ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, ప్రాణాలను కాపాడే హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులతో గంజాయికి దూరంగా ఉంటామని, గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు సేకరించారు. ఎస్పీ స్వయంగా గ్రామస్థులకు, మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాల గురించి సమాచారం అందించిన వారికి రూ. 5,000 నగదు బహుమతి అందజేస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. గంజాయిపై సమాచారం కోసం 87126 56999 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి, సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

