- ప్రేమ పేరుతో బాలికను మోసం
కాకతీయ, గీసుగొండ: ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, 2023లో పదో తరగతి చదువుతున్న బాధితురాలికి, హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన బొడ్డు బన్నీ (21)తో స్నేహితురాలి ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని నమ్మించిన నిందితుడు, అదే ఏడాది మార్చిలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2024 వరకు పలుమార్లు ఈ అఘాయిత్యాన్ని కొనసాగించాడు. 2025 మార్చిలో బాధితురాలు గర్భం దాల్చగా, విషయం బయటకు రాకుండా పుట్టినరోజు కేకులో గర్భస్రావం కలిగించే మాత్రలు కలిపి తినిపించడంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. అనంతరం తన వద్దకు రావాలని వేధించడమే కాకుండా, రాకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఇటీవల వరంగల్‌లో బాధితురాలిపై దాడి చేసి మొబైల్ ఫోన్‌ను కూడా ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, భారతీయ న్యాయ సంహిత మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బొడ్డు బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామని ఏసీపీ వెంకటేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

