లైసెన్సులు లేవు.. పన్నులు కట్టరు!
అధికారుల దృష్టిలో అల్లం, ఉల్లిగడ్డ వ్యాపారులు
‘కాకతీయ’ కథనంతో కదిలిన యంత్రాంగం.. నోటీసుల జారీ
ఏళ్ల తరబడి అనుమతుల్లేకుండానే సాగుతున్న వ్యాపారం
మామూళ్ల మత్తులో మార్కెట్ సిబ్బంది.. దర్యాప్తునకు డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని పాత బీటు బజారులో ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ ఏళ్ల తరబడి సాగుతున్న అల్లం, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వ్యాపారాలపై ఏనుమాముల మార్కెట్ అధికారులు కొరడా ఝళిపించారు. ‘కాకతీయ’ దినపత్రికలో ఇటీవల వెలువడిన కథనంతో మేల్కొన్న మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బుధవారం సంబంధిత వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి అల్లం, ఉల్లి, ఆలుగడ్డలు, కొబ్బరి బొండాల వ్యాపారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం మార్కెట్ నుంచి ముందస్తుగా వ్యాపార అనుమతులు (లైసెన్సులు) తీసుకోవాలి. అయితే, పాత బీటు బజారులో సుమారు 27 మంది వ్యాపారులు అక్రమంగా ఈ వ్యాపారం నిర్వహిస్తుండగా, అందులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లైసెన్సులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు నాలుగు నుంచి ఐదు లోడ్ల సరుకు దిగుమతి అవుతున్నా, మార్కెట్ ఆదాయానికి గండికొడుతూ ఎటువంటి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

సిబ్బంది నిర్లక్ష్యం.. మామూళ్ల మత్తు!
ఈ వ్యాపారాల పర్యవేక్షణ కోసం మార్కెట్ శాఖ తరఫున ఒక ఉద్యోగిని నియమిస్తారు. నలభై, యాభై ఏళ్లుగా ఈ బజారులో వ్యాపారాలు జరుగుతున్నా, పర్యవేక్షకులు ఇంతకాలం ఎందుకు మౌనం వహించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సదరు సిబ్బంది మామూళ్లకు అలవాటుపడి మార్కెట్ ఆదాయానికి భారీగా గండికొట్టారని వ్యాపార వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ‘కాకతీయ’ కథనంపై స్పందించిన ఒక మార్కెట్ ఉద్యోగి, తన బాధ్యతను పక్కనపెట్టి కథనాలపై అక్కసు వెళ్లగక్కడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ జరపాలి: వ్యాపారుల డిమాండ్
ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి, పాత బీటు బజారులో గతంలో డ్యూటీ చేసిన పర్యవేక్షకులందరిపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. పన్నులు ఎగవేసిన వారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయడంతో పాటు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే మార్కెట్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసుల్లో హెచ్చరించారు.


