ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు
అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలి
అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
వైద్యం, విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
కాకతీయ, ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. అలాగే, ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఆమె సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
శాఖల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, గ్రామాల వారీగా పేద కుటుంబాల జాబితాలను సిద్ధం చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని సూచించారు. కొత్త పింఛన్ల మంజూరులో పారదర్శకత ఉండాలని, మరణించిన లబ్ధిదారుల పేర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు లేని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ఆగకుండా చూడాలని, గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు.
వైద్యం, విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను కట్టడి చేసి యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. మహిళా సంఘాలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్రావు, ఆర్డీవో కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

